అమరావతి,అర్జున్ సమాచారం:
అర్నబ్ తుపాను కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలకు తమ వంతు మద్దతుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 5 కోట్ల 1 లక్ష రూపాయల భారీ విరాళాన్ని అందించింది. నేడు అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎస్బీఐ ప్రతినిధి బృందం కలిసింది. ఈ సందర్భంగా ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ అమర రామ్మోహన్ రావు విరాళానికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు. తుపాను బాధితులను ఆదుకునేందుకు ఉదారంగా స్పందించి, భారీ విరాళం అందించినందుకు ఎస్బీఐ యాజమాన్యానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో ఎస్బీఐ అమరావతి సర్కిల్ సీజీఎం సుశీల్ కుమార్, జీఎం కుందన్ జ్యోతి, ఏజీఎం షేక్ షమీన్ భాను తదితరులు ఉన్నారు.